Tuesday, February 1, 2011

తిక్కన-చరిత్ర, Tikkana history


తిక్కన (1205 - 1288) మహాభారతము లో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు.

తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆశయసిద్ధి కోసం ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందువల్ల ఆ ఆలయాన్ని సిద్ధేశ్వరాలయంగా పిలిచారు. యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారు. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అనేక అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకొన్నాయి.

తిక్కన తిరుగాడిన జాడలేవీ?'వింటే భారతం వినాలి .... తింటే గారెలు తినాలి' అనే నానుడికి జీవం పోసింది తిక్కన. మహాభారత కథనాలకు అంతటి ఖ్యాతిని ఆర్జించిన కవిబ్రహ్మ తిక్కన మెచ్చిన ప్రదేశం, ఆయన పూజించిన ఆలయం నేడు దయనీయ స్థితికి చేరుకొన్నాయి.


'మానవుడు పంజరంలోని చిలుకలాంటి వాడు' అనే ఉపమానం, నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించారు. నిర్వచనోత్తర రామా యణంలో మొదటి మనుమసిద్ధిని వర్ణిస్తూ "కీర్తి జాలము త్రిలోకీ శారీకకు అభిరామరాజిత పంజరంబుగజేసి'' అని చెప్పారు. అలాంటి తిక్కనే పూజించి, యజ్ఞం చేసిన సిద్దేశ్వరాలయం, రాతివిగ్రహాలు నేడు నిర్లక్ష్యమనే పంజరంలో చిక్కుకొని శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయన పూజలు చేసిన నందీశ్వరుడ్ని అపహరించారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది కోవూరు ప్రాంతమే.


తిక్కన పూర్వీకులు 'కొట్టురువు' ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటిపేరు 'పాటూరుగా' మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. పదకొండు పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు.
వేప, రావి చెట్లు మొలచి ఆలయం ధ్వంసమవుతోంది. ఆలయ ప్రాంగణాన ఉన్న బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి, సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బావి వర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట కానీ, బావి పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోవడం చేత ఆ శిల్పాల్ని ఇప్పుడు చూడలేము. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే 'ఘంటం' పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. 'ఘంటం' ఉంచే ఒరకు ఒక వైపు సరస్వతీ దేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులు చెప్పారు.

నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ 'వర్ధమానసమాజం' కొన్నేళ్ల కిందట నిర్వహించిన 'తిక్కనతిరునాళ్ళ'లో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత ఒర చిరునామా లేకుండా పోయింది.
తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారు. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలందుకుంటోంది. 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అయితే - సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించిన శిలలు అన్నీ తమ సొంతమని, ప్రభుత్వానికీ దేవాదాయశాఖకూ సంబంధం లేదని పాటూరు వంశస్థుడు ఒకాయన ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకొన్నారట. పదేళ్ల కిం దట మాత్రం ఒక భక్తుడు శిథిల ఆలయానికి వెల్ల వేయించి తన భక్తిని చాటుకొన్నారని చెబుతారు.

పాటూరు గ్రామంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికీ లేకపోవడం విచారకరమని గ్రామస్థులు అన్నారు.
తిక్కన గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలతో ఒక గ్రం«థాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాదులోని టాంకుబండ్‌పై తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించిన పాటూరు గ్రామాన్ని మరచిపోవడం బాధాకరం. ఆయన పూజించి, యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయాన్ని ప్రభుత్వం దర్శనీయ స్థలాల జాబితాలో చేర్చాలని జిల్లా వాసులు, సాహిత్యాభిలాషులు కోరుతున్నారు.
బ్రిటిషువారు నిర్మించిన కట్టడాల్ని సైతం చారిత్రక కట్టడాలుగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తిక్కన తిరుగాడిన నేల స్మృతులు ... శిల్పాల్ని, ఘంటాన్ని, ఒరను, నందీశ్వరుడ్ని పదిలపరచకపోవడం విచారకరం. తెలుగు జాతి గుండెల్లో తీయ తేనియ నుడుల్ని ఆచంద్రార్కం నిల్పిన తిక్కన జ్ఞాపకార్థం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది.

- మడపర్తి రవీంద్ర, ఆన్‌లైన్, కోవూరు(Andhrajyothi sunday magazine-30/01/2011)

  • ==================================
Visit My website - > Dr.Seshagirirao

1 comment:

  1. Thanks for giving so much info for my Telugu project!!!

    ReplyDelete